You Are Wrong If You Think Its All Your Credit | What Inspires Me

You Are Wrong If You Think Its All Your Credit

No Comments

సాధారణంగా మనమందరం నేను చేసిన కృషి ఫలితంగానే ఈ విజయం సాధించాను. లేదా నా కృషి ఫలితంగానే ఈ ఆపదలు తొలగిపోయాయి, ఈ గండాలు గట్టెక్కాయి అని అనుకుంటూ ఉంటాము.
కాని ఆథ్యాత్మిక దృక్కోణంలో చూసినపుడు వాటి వెనుక కనిపించని అనుగ్రహాలు, కారణాలు కూడా ఉంటాయి.
ఉదాహరణగా ఈ క్రింది కథను చదవండి.
             
చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.
ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది.
ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.
"చూడండీ! మనందరిలో ఈ రోజు 'పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి 'ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!
ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! " అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.
మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు.
... ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతో చూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.
అతను కూడా భయపడుతూ బస్సు  దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.
కాని, బస్సులోని ప్రయాణికులందరు "నీవల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు. " అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.
వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.
కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై...
అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు.ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు వారినందరిని కాపాడింది.
                  
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ,  ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదేననుకుంటాము. కాని, ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు! జీవిత భాగస్వామిది కావచ్చు! పిల్లలది కావచ్చు! తోబుట్టువులది కావచ్చు! మన క్రింద పని చేసే వారిది కావచ్చు! లేదా మన శ్రేయస్సును కోరే స్నేహితులది - బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి  అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.
ఒక సినిమాలో చెప్పినట్లు...
"బాగుండడం" అంటే బాగా ఉండడం కాదు. అందరితో కలిసి ఆనందంగా ఉండడం.
ఒక్కరుగా మనం ఆలోచించగలము, పలుకగలము అంతే!
కాని, అందరుగా ఆ ఆలోచనలను పంచుకోగలము, మాట్లాడగలము .
ఒక్కరుగా "ఎంజాయ్ " చేయగలము అంతే!
కాని,అందరుగా "సెలబ్రేట్ " చేసుకోగలము.
ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము.
కాని, అందరితో మనస్పూర్తిగా ఆ నవ్వును పంచుకోగలము - పెంచుకోగలము.
ఇదే సనాతన ధర్మం మనకిచ్చే సందేశం.
   సర్వే జనా: సుఖినోభవంతు!
   సమస్త సన్ మంగళాని భవంతు!
    ఓం  శాంతి  !శాంతి ! శ్శాంతి !
                    

0 comments :

Post a Comment